25, మే 2010, మంగళవారం

నలుపు ఈ దేశ జాతి రంగు




నల్లగుంటానని

అది నీ జాతి రంగని

కాలిన మొద్దు లా వుంటావని

దున్న పోతులా వుంటావని

గొడ్డు మాంసం తిని మొద్దు బారావని

చదువబ్బదని
ప్రతిభలేదని
కుసంస్కారివని

మూర్ఖుడవని
అసింటా వుండమని...

మీరంతా నన్నెన్నన్నా

ఈ దేశ జాతి (జాతీయ) రంగు

నా నలుపు మేనిచ్చాయేనని
సగర్వంగా గర్జిస్తున్నా...

23, మే 2010, ఆదివారం

బ్లాగర్లూ రిజర్వేషన్ల వలన దళితులెవరైనా అంబానీలయ్యారా?



బ్లాగ్ మిత్రులకు నాదొక ప్రశ్న.
పూర్తిగా జస్టిఫై చెయ్యి. ఎక్కడైనా దళిత పదం కనబడినా, వారికి మద్ధతుగా రాత అగుపించినా ఒకటే దాడి చేస్తున్నారు. ఈ అరవై మూడు సంవత్సరాల స్వాతంత్ర్య పాలనలో, 60 యేళ్ళ రాజ్యాంగం అమలులోకి వచ్చిన కాలంలో ఒక్క దళితుడైనా అంబానీగానో, లక్ష్మీ మిట్టల్ గానో అవతరించాడా? ఒక్క రూపాయి పెట్టుబడితో వీళ్ళకు తెలిసినట్లుగా వేలకోట్లు ఆర్జించే ఉపాయాలు దళితులకు తెలియలేదెందుకో. రిజర్వేషన్ల వలన వారు పొందిన ఉద్యోగ శాతమెంత? మీరు యిస్తున్నది ముష్టి 7.5 శాతం. దానికే మానుండి అభ్యర్థులు లేక మరల బ్యాక్ లాగ్ పోస్టులు మిగిలిపోతున్నాయి. ఏమైనా అంటే మేము మెరిట్ వీరుల మంటారు. మరి గిరిజనులు, బీసీలు తో కలుపుకొని పోనీ పోయిన ఆ 40 శాతం మినహా వాటిలో అరవై శాతం మీదే కదా? జనాభాలో మేమున్నది ఎంత? మామీద పడి ఏడ్వడం దేనికి? ఉన్నతోద్యోగాలలో వున్నదెవరు? కీలక అధికారాలన్నీ మీ చేతుల్లోనే వున్నాయి. ఎప్పుడూ రిజర్వేషన్ల వలన మీరేదో కోల్పోయినట్లు ఏడ్పు దేనికి? బీసీ కులాలలో నిజంగా వెనకబడ్డ తరగతులెన్ని? వారు పొందిన వుద్యోగాలెన్ని, పదవులెన్ని? మరల వాటిలో కూడా అగ్రవర్ణాలే ఈ మధ్యకాలంలో చేరిపోతున్నారు. అసలు ప్రభుత్వాలు కల్పిస్తున్న ఉద్యోగాలెన్ని? అంతా ప్రైవేటు మాయజేసి అన్ని అవకాశాలు మీరు పొందడంలేదా? మరొక్క ప్రశ్న ఈ బ్లాగులు రాస్తున్న వాళ్ళలో దళితులెందరు? మీ అంత తీరుబడి వాళ్ళకు లేకే కదా? నేను కామెంట్లకు మాత్రమే పరిమితమవుదామనుకున్నా కానీ మీ గోలెక్కువై యిలా అడుగుపెట్టాను. రండి చర్చిద్దాం...