15, డిసెంబర్ 2010, బుధవారం

అంటరానితనం బలిగొన్న ఓ నిండుప్రాణం



హైదరాబాదులోని విల్లా మేరీ కాలేజీలో బండి అనూష అనే ఈ అమ్మాయిని తోటి విద్యార్థినులు తాను దళిత కులానికి చెందినదని తెలిసిన తరువాత ఆమెపట్ల వ్యవహరించిన తీరుతో విసుగుచెంది అనూష ఆత్మహత్య చేసుకుంది. ఇది గత నవంబర్ ఐదో తారీఖున జరిగింది. తాను ఆత్మ హత్య చేసుకోబోతున్నట్లు తన తోటి విద్యార్థినులకు చెప్పినా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదంట. ఆమె తన తండ్రికి చివరి సారిగా బై డాడ్, నేను చనిపోతున్నా అని రాసిపెట్టింది. ఆమె తండ్రి తన కూతురి పట్ల జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆమె కులం తెలిసినప్పటినుంచి వాళ్ళు ఆమెను ఒంటరిగా ప్రత్యేకంగా ఓ బెంచీలో కూచోపెట్టారని చెప్పారు. ఇలా ఓ దళిత విద్యార్థిని జీవితాన్ని బలిగొన్న అంటరానితనమన్న ద్వేషాన్ని, అగ్రకుల దురహంకారాన్ని తిట్టకుండా వుండగలమా? అంతటితో ఈ సమస్య తీరుతుందా? మనిషి ఎక్కడికో ఎదిగిపోతున్నాడన్న అపోహలలో వుంచే మేధావులు మనమెక్కడుండిపోయామో గుర్తెరిగితే చాలు..

అనూషలాంటి మరో విద్యాకుసుమం రాలిపోకుండా కాపాడుకుందాం...

వివరాలకు


6, డిసెంబర్ 2010, సోమవారం

బాబా సాహెబ్ బాటను వీడుతున్నామా?



బాబా సాహెబ్ అంబేద్కర్ వర్థంతి రోజున ఈ ప్రశ్నను మనం వేసుకోవాల్సిన అవసరముందనిపిస్తోంది. రాజ్యాధికారం కోసం అణగారిన వర్గాలు తమ ప్రయత్నంను ముమ్మరం చేయాల్సింది పోయి దళారీ వలసవాద పాలక వర్గాలకు కొమ్ము కాస్తూ, వారు విసిరేసిన ఎంగిలిమెతుకుల లాంటి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులనుభవించడానికి పాకులాడటం వలన అసలైన రాజ్యాధికారానికి ఆమడ దూరం జరిగి పోతున్నామన్న విషయాన్ని మరిచిపోతున్నాం. ఈ పార్లమెంటరీ రాజకీయ ఊబిలో కూరుకుపోతూ మన ఉనికికే ప్రమాదకరంగా మారుతున్న ప్రపంచీకరణ, సంస్కరణ రూపాల మాయలో కొట్టుకుపోతున్నాం. అధికారమిచ్చే మత్తులో పడి తమ మూలాలను విడిచిపెట్టడం వలన మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. కావున ఈ దినాన్ని మరో మారు బాబా సాహెబ్ ను అధ్యయనం చేయడానికి, తద్వారా మన అంతిమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఓ సరికొత్త వెలుగులో పయనిద్దామని ప్రతిన బూనుదాం...
జై భీం..