15, డిసెంబర్ 2010, బుధవారం

అంటరానితనం బలిగొన్న ఓ నిండుప్రాణం



హైదరాబాదులోని విల్లా మేరీ కాలేజీలో బండి అనూష అనే ఈ అమ్మాయిని తోటి విద్యార్థినులు తాను దళిత కులానికి చెందినదని తెలిసిన తరువాత ఆమెపట్ల వ్యవహరించిన తీరుతో విసుగుచెంది అనూష ఆత్మహత్య చేసుకుంది. ఇది గత నవంబర్ ఐదో తారీఖున జరిగింది. తాను ఆత్మ హత్య చేసుకోబోతున్నట్లు తన తోటి విద్యార్థినులకు చెప్పినా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదంట. ఆమె తన తండ్రికి చివరి సారిగా బై డాడ్, నేను చనిపోతున్నా అని రాసిపెట్టింది. ఆమె తండ్రి తన కూతురి పట్ల జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆమె కులం తెలిసినప్పటినుంచి వాళ్ళు ఆమెను ఒంటరిగా ప్రత్యేకంగా ఓ బెంచీలో కూచోపెట్టారని చెప్పారు. ఇలా ఓ దళిత విద్యార్థిని జీవితాన్ని బలిగొన్న అంటరానితనమన్న ద్వేషాన్ని, అగ్రకుల దురహంకారాన్ని తిట్టకుండా వుండగలమా? అంతటితో ఈ సమస్య తీరుతుందా? మనిషి ఎక్కడికో ఎదిగిపోతున్నాడన్న అపోహలలో వుంచే మేధావులు మనమెక్కడుండిపోయామో గుర్తెరిగితే చాలు..

అనూషలాంటి మరో విద్యాకుసుమం రాలిపోకుండా కాపాడుకుందాం...

వివరాలకు


6, డిసెంబర్ 2010, సోమవారం

బాబా సాహెబ్ బాటను వీడుతున్నామా?



బాబా సాహెబ్ అంబేద్కర్ వర్థంతి రోజున ఈ ప్రశ్నను మనం వేసుకోవాల్సిన అవసరముందనిపిస్తోంది. రాజ్యాధికారం కోసం అణగారిన వర్గాలు తమ ప్రయత్నంను ముమ్మరం చేయాల్సింది పోయి దళారీ వలసవాద పాలక వర్గాలకు కొమ్ము కాస్తూ, వారు విసిరేసిన ఎంగిలిమెతుకుల లాంటి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులనుభవించడానికి పాకులాడటం వలన అసలైన రాజ్యాధికారానికి ఆమడ దూరం జరిగి పోతున్నామన్న విషయాన్ని మరిచిపోతున్నాం. ఈ పార్లమెంటరీ రాజకీయ ఊబిలో కూరుకుపోతూ మన ఉనికికే ప్రమాదకరంగా మారుతున్న ప్రపంచీకరణ, సంస్కరణ రూపాల మాయలో కొట్టుకుపోతున్నాం. అధికారమిచ్చే మత్తులో పడి తమ మూలాలను విడిచిపెట్టడం వలన మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. కావున ఈ దినాన్ని మరో మారు బాబా సాహెబ్ ను అధ్యయనం చేయడానికి, తద్వారా మన అంతిమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఓ సరికొత్త వెలుగులో పయనిద్దామని ప్రతిన బూనుదాం...
జై భీం..

20, నవంబర్ 2010, శనివారం

మేం ప్రపంచాన్నె పునర్నిర్మిస్తాం - మీనాకందసామి



ఈ వీడియోలో మన కులవ్యవస్థపై తమిళ దళిత కవయిత్రి మీనాకందసామి భారతదేశ వీర్యానిది ఏ కులమని ధైర్యంగా ప్రశ్నిస్తున్నారు. తమపై జరుగుతున్న దాడులను, కుట్రలను అంతర్జాతీయ వేదికపై ప్రశ్నిస్తున్నారు.వినండి..

19, నవంబర్ 2010, శుక్రవారం

చెత్తబుట్ట - సూర్య కిరణం




తొలి సూర్య కిరణం
మీ పీతి కంపుతో
ఎక్కడ మలినమవుతుందోనని
నా ఒళ్ళంతా చీపురు చేసుకొని
ఆ చివరనుండి ఈ చివరి వరకు
ఊడ్చి మీ మలినాలను
మీరు పారబోసిన మీ కంపు మావిని
మా నెత్తికెత్తుకొని
మీ ఒడలంతా మీ అమ్మ తుడిచిందో లేదో కాని
మేము మాత్రం తప్పక తుడిచి పారబోస్తుంటే...

రాత్రంతా మీ చీకటి కార్యాలతో
పారబోసిన మీ చెత్త జూసి
దాక్కోలేక సిగ్గుపడిన సందమామ
మా రాకతో ఊపిరి పీల్చుకొని
సూరీడు చాటుకు పోతూ
మీ కంటపడకుండా
మా వంక విసిరిన నవ్వు
గుండెల్లో పదిలం బిడ్డా...

ఈ పీతి బుట్ట సాచ్చిగా
మీ జన్మ రహస్యం
ఇంతే...

24, అక్టోబర్ 2010, ఆదివారం

నాగరికులెవరో???




ఓ నవనాగరిక మానవులారా
నాగరికతకు నడక నేర్పినవి
మా తోలు చెప్పులే..

మీ కాలిలో ముళ్ళు దిగితే
మా గుండెల్లో గునపాలు
దిగినట్లుండేది..

కానీ
మా గుండెలపై
మీ పాదాలను
తొలగించలేకపోతున్నాం...

మరి నాగరికులెవరో
చెప్పగలరా?

16, అక్టోబర్ 2010, శనివారం

ద్రావిడులుగా దసరా దీపావళిని గురించి ఆలోచించండి..





ద్రావిడులపై ఆధిపత్యం సంపాదించే క్రమంలో నాటి ఆర్యులు ద్రవిడులను, రాక్షసులుగా చిత్రీకరించి వారిపై విజయం సాధించడానికి అనేక మోసపూరిత కుట్రలు సాగించి, తమ ఆడవాళ్ళను ప్రయోగించి విజయాలు సాధించి పండుగలు చేసుకున్నారు. ఆ పండుగలను మనపై రుద్ది వాటిని మన సంస్కృతిలో భాగంగా కల్పించి బలవంతంగా మనపై ప్రయోగించారు. ఆర్యులు తమ దేశదిమ్మరితనంతో భారత ఉపఖండంలో ప్రవేశించి తమకున్న అశ్వసంపదను, విల్లంబుల బలంతో ఇక్కడి స్థానిక రాజ్యాలపై దాడులు చేస్తూ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటు ఇక్కడి వారిని రాక్షసులుగా చిత్రీకరించి తమకు తాము దేవతలుగా ఊహించుకొని పురాణాలు సృష్టించుకున్నారు. వాళ్ళు ఈ భూభాగంపై ప్రవేశించే నాటికి ఇక్కడ నగరాలు నిర్మించబడి, నాగరికతతో, శతృ దుర్బేద్యంగా వున్న రాజ్యాలు విలసిల్లాయనడానికి పురాణాలలో వర్ణించబడ్డ రావణాసురిడి లంకా పట్టణం, బలిచక్రవర్తి కేరళ రాజ్యం, హిరణ్యాక్షుడి రాజ్యాల వర్ణణలు చూస్తే అర్థమవుతుంది. తమకు లేని ఈ నాగరికత, సంపదలను హరించి ఇక్కడి మట్టిమనుషులను అసురులుగాను, తమను సురులుగా మార్చుకున్నారు. మనపై విజయాలను సాధించడానికి ఎన్ని కుయుక్తులు పన్నారో, కుట్రలు చేసి గెలిచారో వారి గాధలలోనే తెలుస్తోంది. కావున ద్రావిడ చక్రవర్తులైన రావణబ్రహ్మ, మహిషులపై వారి మోసపూరిత విజయాలకు చిహ్నంగా నిలిచిన ఈ దసరాను, నరకచక్రవర్తిపై తమ భార్యను ప్రయోగించి గెలిచినందుకు చేసుకుంటున్న దీపావళిల పట్ల ద్రావిడులుగా, దళితులుగా ఈ నేల మట్టిమనుషులుగా ఆలోచించాల్సిన అవసరముంది. మనవి కాని పండగలను మనం బహిష్కరిద్దాం. బతుకమ్మలను, పైడితల్లమ్మలను కొలుద్దాం..

4, అక్టోబర్ 2010, సోమవారం

పుక్కిట పురాణాల నేపథ్యంలో ఓ --- తీర్పు



ఈ మధ్య వచ్చిన అయోధ్య తీర్పుపై చర్చ చేయడానికే చాలా మంది జంకుతున్నారు. ఎందుకంటే మతకల్లోలాలు వస్తాయేమో, ఈ పిచ్చి జనాలు కొట్టుకు చస్తారేమోనని. కానీ అటువంటివేవీ జరగలేదంటే దీని నేపథ్యమే ఓ అబధ్ధపు రంగుటద్దాలలో వుందన్నది స్పష్టమైంది. ఎవడికి వాడు గొప్ప లౌకికవాదిగా, మానవతావాదిగా కొత్త బురఖాలకోసం యాతనపడుతున్నారు. నిజంగా వీళ్ళదంతా నిజమైన దేశాభిమానమా? ఎవడికి వాడు రాజకీయ జిత్తులలో పై చేయి సాధించాలని చూస్తూ ఈ తీర్పుతో న్యాయదేవత కళ్ళను పూర్తిగా తొలగించారన్నది స్పష్టం. ఈ తీర్పు వెలువరించిన వాళ్ళకంటే కాస్తా కల్లు, మాంసం శిక్షగా వేసే కులపెద్దలే నయం కాదా? ఎందుచేతనంటే..

అసలు మీరన్న హిందూ ధర్మం ప్రకారమే యుగాల లెక్కల ప్రాప్తికి ఇప్పటికి రాముడు పుట్టి కొన్ని లక్షల సంవత్సరాలైంది. ఒక్కో యుగం అంతమైనప్పుడు మొత్తం నాశనమైందన్నది మీ లెక్కే. అలా అయినప్పుడు అన్ని లక్షల సం.క్రితం నాశనమైన వాటి ఆనవాళ్ళు ఇంకా ఎలా లభ్యమవుతాయి. మొన్నటికి మొన్న వున్న వూళ్ళే ప్రాజెక్టుల పేరుతో నీళ్ళు నింపి నాశనమైన తరువాత వాటి ఆనవాళ్ళు మిగులుతున్నాయా? తుఫానులు, భూకంపాలతో నాశనమైన చోట ఇంకేమి మిగులుతుంది. ఇప్పుడున్న ఈ భారత దేశంలో వున్న అయోధ్య అన్ని లక్షల సం.ల క్రితం నాటి అయోధ్యగా ఎలా నిరూపించగలరు? అనవసరంగా ప్రజల బుఱ ను పాడుచేసి మతం రంగుతో మానవత్వాన్ని మంటగలిపి అసలు సమస్యలనుండి దృష్టి మళ్ళీంచే ఇలాంటి కుయుక్తులు పాలకవర్గాలు ఎన్నైనా చేస్తూనే వుంటాయి.

మరో సందేహం ఏమంటే కేసు అరవై ఏళ్ళ క్రితం నాడు మొదలైంది. మరి ఇది కొనసాగుతున్న కాలంలో అక్కడ బాబ్రీ మసీదు వున్నదే కదా? అది వాడుతున్నారా లేదా అన్నది ముఖ్యంకాదు. ఆ పేరుతో కట్టడం వుంది కదా? దానికింద పరిశోధించి ఆలయాల ఆనవాళ్ళు వున్నాయని తీర్పునిచ్చారంటున్నారు. మరి ఆ కట్టడాన్ని కూలగొట్టించడంలో న్యాయస్థానం పాత్రకూడా వున్నదని ఒప్పుకుంటున్నారా? మరి అది కూలగొట్టబడడం వల్లనే కదా మీ తీర్పునివ్వగలిగారు? అంటే బాబ్రీ మసీదు కూల్చివేత వెనక అలహాబాదు న్యాయస్థానం పాత్రకూడా వుందన్నమాట అన్నది సత్యదూరం కాదు. ఒకరేమో ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారంటారు, ఒకరేమో ఆలయ శిధిలాలు లేవంటారు. అంటే ఎవరిది నిజమైన తీర్పు. అసలు ఈ తీర్పు న్యాయస్థానం వెలువరించిందా లేక మతపెద్దల కూటమిదా? అన్న సందేహం వుంది. తీర్పు శాస్త్రీయ ప్రమాణాలకు దూరమన్నది నిజం కాదా? ఈ న్యాయమూర్తులు ఎవరి మతానికి వాళ్ళు రిప్రజెంట్ చేసినట్లుగా లేదా?

రాముడు కలలోకి వచ్చి చెప్పాడన్న సాకుతో సాధువుల ప్రేరణతో, వైకుంఠానికి చేరి స్వర్గ సుఖాలనుభవించొచ్చు అని చెప్పిన వారి ప్రాపకంతో బాబ్రీ కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాటి బ్రాహ్మణ ప్రధాని. ఇంతకంటే దారుణముంటుందా?

మూడు వాటాలేసి సమన్యాయం పాటించామంటున్నారు. ఇదెలా? హిందు, ముస్లింలకు, నిర్మోహి అఖారాకు మూడు వాటాలన్నారు. ఈ నిర్మోహి అకారా వారు హిందువులు కాదా? అంటే రెండు వాటాలు వీళ్ళకు ఒక వాటా వాళ్ళకు.

అసలు ఈ మసీదులు, మందిరాలు తప్ప జనానికి వేరే పనిలేదనుకుంటారు ఈ బుఱ తక్కువ వెధవలు. జనానికి ఇవేమీ పట్టవని, వాళ్ళ పొట్టకోసం పాడుపడుతూ వుంటారని, ఎవడో ఒకడు కోరి చిచ్చు పెడితే తప్ప వాళ్ళు ఏమీ స్వతహాగా చెడ్డ పనులు చేయరన్నది నేడు నిరూపితమైంది. కాబట్టి ఇకనైనా మందిరాలు, మసీదులు గురించి మాని జనం గోడు పట్టించుకోండి. రాసుకున్న రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నాలు మానుకోండి.

జయహో భారత్..


యుగాల గురించిఃhttp://www.indianetzone.com/40/four_yugas.htm

14, జులై 2010, బుధవారం

మీలో పరువున్నవాడెవడు?




ప్రేమించిన హృదయానికి
కులం గోత్రం ఎరుకవుతుందా?

కన్నులెరుగని కోణాలను
పట్టుకొని నిండు నూరేళ్ళ
జీవితాలను బలిగొంటున్న
మీ హుక్కా పొగలకు
పరువెక్కడుంది?

హత్యలన్నీ పవరు హత్యలే
తప్ప పరువు కోసం కాదు..

ఓట్ల దళారీ లంజకొడుకుల
అధికారం కోసం
మీ జారిన వెన్నుకు
దన్నుగా వుండి
యువ హృదయాలను
ఇడీ అమీన్ లా కాల్చుకు
తింటున్నారు...

మీలో పరువున్నవాడేవడురా?

25, మే 2010, మంగళవారం

నలుపు ఈ దేశ జాతి రంగు




నల్లగుంటానని

అది నీ జాతి రంగని

కాలిన మొద్దు లా వుంటావని

దున్న పోతులా వుంటావని

గొడ్డు మాంసం తిని మొద్దు బారావని

చదువబ్బదని
ప్రతిభలేదని
కుసంస్కారివని

మూర్ఖుడవని
అసింటా వుండమని...

మీరంతా నన్నెన్నన్నా

ఈ దేశ జాతి (జాతీయ) రంగు

నా నలుపు మేనిచ్చాయేనని
సగర్వంగా గర్జిస్తున్నా...

23, మే 2010, ఆదివారం

బ్లాగర్లూ రిజర్వేషన్ల వలన దళితులెవరైనా అంబానీలయ్యారా?



బ్లాగ్ మిత్రులకు నాదొక ప్రశ్న.
పూర్తిగా జస్టిఫై చెయ్యి. ఎక్కడైనా దళిత పదం కనబడినా, వారికి మద్ధతుగా రాత అగుపించినా ఒకటే దాడి చేస్తున్నారు. ఈ అరవై మూడు సంవత్సరాల స్వాతంత్ర్య పాలనలో, 60 యేళ్ళ రాజ్యాంగం అమలులోకి వచ్చిన కాలంలో ఒక్క దళితుడైనా అంబానీగానో, లక్ష్మీ మిట్టల్ గానో అవతరించాడా? ఒక్క రూపాయి పెట్టుబడితో వీళ్ళకు తెలిసినట్లుగా వేలకోట్లు ఆర్జించే ఉపాయాలు దళితులకు తెలియలేదెందుకో. రిజర్వేషన్ల వలన వారు పొందిన ఉద్యోగ శాతమెంత? మీరు యిస్తున్నది ముష్టి 7.5 శాతం. దానికే మానుండి అభ్యర్థులు లేక మరల బ్యాక్ లాగ్ పోస్టులు మిగిలిపోతున్నాయి. ఏమైనా అంటే మేము మెరిట్ వీరుల మంటారు. మరి గిరిజనులు, బీసీలు తో కలుపుకొని పోనీ పోయిన ఆ 40 శాతం మినహా వాటిలో అరవై శాతం మీదే కదా? జనాభాలో మేమున్నది ఎంత? మామీద పడి ఏడ్వడం దేనికి? ఉన్నతోద్యోగాలలో వున్నదెవరు? కీలక అధికారాలన్నీ మీ చేతుల్లోనే వున్నాయి. ఎప్పుడూ రిజర్వేషన్ల వలన మీరేదో కోల్పోయినట్లు ఏడ్పు దేనికి? బీసీ కులాలలో నిజంగా వెనకబడ్డ తరగతులెన్ని? వారు పొందిన వుద్యోగాలెన్ని, పదవులెన్ని? మరల వాటిలో కూడా అగ్రవర్ణాలే ఈ మధ్యకాలంలో చేరిపోతున్నారు. అసలు ప్రభుత్వాలు కల్పిస్తున్న ఉద్యోగాలెన్ని? అంతా ప్రైవేటు మాయజేసి అన్ని అవకాశాలు మీరు పొందడంలేదా? మరొక్క ప్రశ్న ఈ బ్లాగులు రాస్తున్న వాళ్ళలో దళితులెందరు? మీ అంత తీరుబడి వాళ్ళకు లేకే కదా? నేను కామెంట్లకు మాత్రమే పరిమితమవుదామనుకున్నా కానీ మీ గోలెక్కువై యిలా అడుగుపెట్టాను. రండి చర్చిద్దాం...